Technology

ఫ్లిప్ కార్ట్ తో విడిపోయిన ఫోన్ పే..

ఇప్పుడంతా ఫోన్ పే యుగం అయిపోయింది. చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తూ క్షణంలో ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఇప్పుడు పోటీ పడి ట్రాన్సాక్షన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఒక్కటిగా ముందుకు సాగాయి. ఇకపై అవి రెండూ వేరు కానున్నాయి. ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పేకి ఫ్లిప్ కార్ట్ తో ఉన్న బంధం నేటితో ముగిసిపోయిందనే చెప్పాలి. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్నేళ్లుగా యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియ ఉండేది. అయితే ఆ ప్రక్రియ తాజాగా పూర్తయింది. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ రెండు సంస్థలు ప్రకటన రిలీజ్ చేశాయి. అయితే ఈ రెండు కంపెనీల్లోనూ వాల్ మార్ట్ అనేది ప్రధాన వాటాదారుగా ఉంది.

ఇలా ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ వంటివి వేరు అయిన పరిణామం వల్ల ఫోన్ పే పూర్తి ఇండియన్ కంపెనీగా రూపాంతరం చెందింది. దీని వల్ల ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లో అది చేరిపోయింది. యూపీఐ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పేను ఫ్లిప్ కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ అయిన సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజనీర్ అనే ముగ్గురు వ్యక్తులు 2015లో నెలకొల్పారు. అప్పుడు ఈ యాప్ చెల్లింపుల్లో రికార్డు స్థాయిలో ముందుకు సాగింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను ఈ యాప్ తీర్చేది. ఇప్పటికీ కూడా అదే హవాతో ముందుకు వెళ్తోంది. ఏ బడ్డీ కొట్టుకు వెళ్లినా ఫోన్ పే లేకుండా ఉండదు. ప్రజాధరణను సొంతం చేసుకుని ఫోన్ పే ముందుకు వెళ్తోంది. అది ఇప్పుడు పూర్తి భారతీయ కంపెనీగా మారింది.