గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించి వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాత కిట్‌ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్ కూలడంతో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు.
ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రిని సందర్శించిన మంత్రి విడదల రజిని మహిళల మృతికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు పబ్లిసిటీ ట్రిక్స్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో టీడీపీ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారని విడదల రజిని తెలిపారు. డిసెంబరు 28న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. పబ్లిసిటీ పట్ల ఆయనకున్న మోజు మనుషుల ప్రాణాలను బలిగొందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని చూపించేందుకు చంద్రబాబు నాయుడు ఇరుకు సందుల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపించింది.