రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
పార్వతీపురం : భారత ప్రధాని నరేంద్ర మోది మూడు నల్ల చట్టాల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంగం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, కృష్ణపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ,పంజాబ్ సరిహద్దుల్లో రైతులు 13 నెలలపాటు నిరశన కార్యక్రమాలు నిర్బహించి కొన్ని వందల ప్రాణాలు పణంగా పెట్టారని తెలిపారు. ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోది దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించి రైతులకు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పిస్తామని, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై కేసులు ఎత్తివేస్తామని , చనిపోయిన రైతు కుటుంబాలును ఆర్థికంగా ఆదుకుంటామని హామీలిచ్చి గాలికొదిలేసారని అన్నారు. దీనికి నిరసనగా జనవరి 26న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రైతులు ర్యాలీలు నిర్వహించబోతున్నారని, ఈ కార్యక్రమానికి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ మద్దతు ప్రకటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతుందని ప్రకటించారు. కార్యక్రమంలో గ్రామ యువత, రైతులు పాల్గొన్నారు.