AP

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట..

ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక స్టేజిలో ఇద్దరు గల్లాలు పట్టకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత.. దమ్ముంటే నా నియోజకవర్గంలో అడుగు పెట్టు అంటూ పరస్పరం సవాళ్లు చేసుకునే పరిస్థితికి వెళ్లింది. విజయవాడ కేంద్రంగా ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతుంది. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాల్గొన్నారు. భవకుమార్ తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేసారు. విందులో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్న సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ను తనకు చెప్పకుండా సీఎం వద్దకు తీసుకెళ్లడంపై ఉదయభానును మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.

దీనికి స్పందించిన సామినేని తనకు కాంగ్రెస్‌లో ఉన్న సమయం నుంచి శ్రీనివాస్‌తో సంబంధాలు ఉన్నాయని తీసుకెళ్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తన నియోజకవర్గంలో సామినేని జోక్యం చేసుకోవటంపై వెల్లంపల్లి నిలదీసారు. విజయవాడ నీ సొత్తా.. నీకేమైనా రాసిచ్చారా అంటూ సామినేని ఆగ్రహంతో వెల్లంపల్లిని నిలదీసారు. ఇద్దరి మధ్య వాగ్వాదంలో నా నాయోజకవర్గంలో నీవు రాజకీయాలు చేస్తే నేను నీ నియోజకవర్గం జగ్గయ్యపేటలో వచ్చి రాజకీయాలు చేస్తానంటూ వెల్లంపల్లి హెచ్చరించారు. దీనికి స్పందనగా నీకు దమ్ముంటే జగ్గయ్య పేటలో అడుగు పెట్టు అంటూ ఉదయభాను సవాల్ చేసారు. పార్టీలో సీనియర్ నని.. నీ లాగా మూడు పార్టీలు మారలేదని.. ఊసరవెల్లివి నీవంటూ వెల్లంపల్లిపై సామినేని ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ ఉదయభాను వెల్లంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో కొన్ని పరుష.. అనుచిత పదాలతో ఇద్దరు నేతలు దూషించుకున్నారు. ఒకరినొకరు తోసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఈస్ట్ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ జోక్యం చేసుకొని ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో..వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన వేడుకల్లో అవినాశ్‌, ఉదయభాను మాత్రమే కనిపించారు.