AP

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా

పెద్దగా తేడాలేం లేవు.! అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎవరు అధికారంలో వున్నా ఇంతే.! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా నడిచింది.

ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు.

గతంలో చంద్రబాబు దాదాపు పది లక్షల కోట్లన్నారు. అంతకు ముందూ ఇలాంటివి జరిగాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. పెట్టుబడిదారుల్ని, పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు ఇదొక మార్గం. కానీ, అసలు ఇక్కడ జరుగుతున్నదేంటి.? ఈ ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చుతాయి.?

ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి, ఇలాంటి సదస్సుల్లో కుదిరిన ఒప్పందాలకు సంబంధించి 10 శాతం కార్యరూపం దాల్చినా, అది పెద్ద విజయం సాధించినట్లేనట. అంటే, పదమూడు లక్షల కోట్లలో పది శాతం.. అనగా లక్షా ముప్ఫయ్ వేల కోట్లన్నమాట. ఇంకో ఏడాది మాత్రమే పాలనా కాలం వుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారా.? లేదా.?

అన్నది ఇప్పుడే చెప్పలేం. చంద్రబాబు హయాంలో కుదిరిన ఒప్పందాలకు అతీ గతీ లేదు. మరి, వైఎస్ జగన్ అధికారంలో వున్నప్పుడు కుదురుతున్న ఒప్పందాల గతి ఏమవుతుంది.? ఈ సమ్మిట్ కోసం గట్టిగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితాలొస్తే, జరిగిన ఖర్చు పెద్ద ఎక్కువేమీ అనిపించదు. కానీ, ఫలితాలు రాకపోతేనే.. ఖర్చు దండగ వ్యవహారమవుతుంది. ‘ఏం తేడా లేదు.. చంద్రబాబు, జగన్ ఒకటే’ అన్నట్లుంటుందా పరిస్థితి.? వేచి చూడాల్సిందే.