AP

ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..–: పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు మచిలీపట్నం చేరుకుంటున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు చెక్కులను పంపిణీ చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సభలో ప్రసంగించారు.

 

పదేళ్ల కిందట నేను పార్టీ పెట్టినప్పుడు నా వెనుక ఎవరూ లేరని, సగటు మనిషికి మేలు చేయాలనే తపనతో పార్టీ పెట్టానని అన్నారు. ఆ సమయంలో నాకు రాజకీయాలు తెలియవు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సగటు మనిషికి మేలు చేయాలన్నదే తపన అని అన్నారు. నాకు పింగళి వెంకయ్య స్ఫూర్తి అని, పేదలకు అండగా నిలువాలన్నదే నా ఉద్దేశమని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. మీ అభిమానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎంతో మంది పార్టీలు పెట్టి వదిలేశారు. రెండు చోట్ల ఓడిపోయినా ప్రజల కోసం నిలబడ్డానని పేర్కొన్నారు.

 

మహా అయితే ప్రాణాలు పోతాయి.. మహానుభావుల స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలున్నారు.. తెలంగాణలో 30 వేల మంది క్రియాశల కార్యకర్తలున్నారన్నారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.