AP

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ్ళ పాదయాత్రలో ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మార్తాడు క్యాంప్ సైటులో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడుతున్నారు.

“జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్నారు. విద్యా, వైద్యం, విద్యుత్‌, పారిశ్రామిక తదితర రంగాలన్నిటినీ నాశనం చేసేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేయడం చేతకాదు. కనుక చుట్టూ ఓ 20-30 మంది సలహాదారులను పెట్టుకొన్నాడు. కానీ వాళ్ళ సలహాలు వింటారా. వినడు. కానీ వాళ్ళకి లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తుంటాడు. వాళ్ళ సలహాలతో మూడు రాజధానులు అంటూ మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేశారు.

ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు. చివరికి ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకొన్నారు. అప్పు లభిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకొన్నారు. సంక్షేమ పధకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ శ్రీలంకలా దివాళా తీయించేస్తున్నాడు. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసేశాడు. ఎవడబ్బ సొమ్ము ఇది? ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రజలదే కదా? దీని కోసం రేపు విద్యుత్‌ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇంటి పన్ను అన్నీ పెంచేస్తాడు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా భ్రష్టు పట్టించేస్తున్నారో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిదంగా ఉందో, టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎంత తేడా ఉందో వివరిస్తూ, మన రాష్ట్రాన్ని ఏవిదంగా బాగు చేసుకోవాలో ప్రజలకు తెలియజేసేందుకే నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేస్తున్నారు.

ఒకప్పుడు ఈ వేధింపులకి భయపడి టిడిపికి మద్దతు పలికేందుకు వెనుకంజవేసిన ప్రజలు ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి నారా లోకేష్‌తో కలిసి నడుస్తున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజలలో వచ్చిన ఈ మార్పుని వైసీపీలో నేతలు కూడా చూస్తున్నారు. అందుకే తాము జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి మాతో కలిసిపనిచేసేందుకు సిద్దపడుతున్నారు.

బడ్జెట్‌ అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మెగాబైట్‌కి గిగాబైట్‌కి తేడా తెలియని సిఎం జగన్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తానంటున్నాడు. అంటే మన దేశానికే కాకుండా పొరుగు దేశాలకి కూడా విద్యుత్‌ సరఫరా చేస్తారా?అని ఎవరైనా తనను ప్రశ్నిస్తే వారిపై అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నాడు. చెత్త ప్రభుత్వం. చెత్త పాలన. అభివృద్ధి లేదు అంతా శూన్యం. ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు. దీంతో రాష్ట్రంలో యువత అందరూ వలసలు పోతున్నారు.

కనుక ఈ సైకో ప్రభుత్వం పోతే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగుపడదు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవ్వాలంటే టిడిపిని గెలిపించుకోవాలి. ప్రజలు సుఖంగా జీవించాలంటే ఓటుని ఆయుధంగా చేసుకొని ఈ జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపి మీ అందరి కోసమే పనిచేసే టిడిపిని గెలిపించుకొని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి,” అంటూ నందమూరి బాలకృష్ణ సిఎం జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు.