AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు వేస్తున్నట్లు మాట్లాడారు.

నేడు సిద్ధిపేట జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తాను తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పొరుగు రాష్ట్రంతో పోల్చి చూపితే, ఆంద్రా మంత్రులు ఎగిరెగిరిపడ్డారని అన్నారు. ఉన్నమాట అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు.

ఆనాడు ప్రత్యేకహోదా కోసం పోరాడుతామన్నారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారెందుకు?మీ కళ్ళ ముందే విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే దానిని కాపాడుకోవడం కోసం ఎందుకు పోరాడటం లేదు? అని అడిగాను. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి రోజుకి 8 గంటలే విద్యుత్‌ ఇస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలలో ఏడెనిమిది గంటలే ఇస్తున్నారు. కానీ తెలంగాణలో 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నామని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

నేను ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరపునే మాట్లాడాను తప్ప ఎవరినీ కించపరలేదు. ఆంద్ర మంత్రులకు చేతనైతే విశాఖ ఉక్కు కోసం పోరాడండి. ప్రత్యేకహోదా కోసం పోరాడండి. మా కాళేశ్వరం ప్రాజెక్టుతో పొలాలకు నీళ్ళు పారించుకొంటున్నాము. మీరు కూడా అలాగ పోలవరం ప్రాజెక్టు నిర్మించుకొని నీళ్ళు పారించుకోమని చెప్పాను. తప్పా?అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు.

అంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’ ఆంధ్రాలో పరిస్థితి ఇది. తెలంగాణలో పరిస్థితి ఇదీ అంటూ రెండు రాష్ట్రాలలో ప్రాజెక్టుకు, రోడ్లు, సచివాలయాల ఫోటోలను ప్రచురించి ఏపీలో దయనీయ పరిస్థితులున్నాయని చెప్పుకొచ్చింది.

కనుక దానికి వైసీపీ సొంత పత్రిక సాక్షితో నేడు సమాధానం చెప్పించింది. మంత్రి హరీష్‌ రావు అనవసరంగా ఆంద్రా విషయాలలో వేలుపెట్టి రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నట్లు మాట్లాడుతున్నారని సాక్షి వ్రాసుకొచ్చింది. గతంలో సిఎం కేసీఆర్‌ ఆయనను పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేసింది. మంత్రి హరీష్‌ రావు ఈవిదంగా మాట్లాడుతుండటం వలననే ఏపీ మంత్రులు గట్టిగా జవాబు చెప్పాల్సి వచ్చిందని, ఆయన కాస్త నోరు అదుపులో ఉంచుకొంటే మంచిదని సూచించింది. ప్రతీరాష్ట్రానికి కొన్ని ప్లస్సులు, కొన్ని మైనసులు ఉంటాయని ఏపీలో పరిస్థితులను సమర్ధించుకొంది.

కానీ ఏపీ, తెలంగాణ మంత్రుల ఈ పరస్పర విమర్శలు, వారి మీడియా పోరాటాలు అన్ని ఉత్తుత్తివే. రెండు ప్రభుత్వాలను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పరస్పరం ఈవిదంగా కీచులాడుకొంటూ, ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటారని అందరికీ తెలుసు.