ఏపీలో రాజకీయపార్టీలకు దేని సమస్యలు దానికి, దేని లెక్కలు దానికీ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టినా అన్నీ మొక్కుబడిగానే నిరసనలు తెలిపి ఊరుకొన్నాయి.
కానీ ఎప్పుడైతే తెలంగాణ సిఎం కేసీఆర్ మీకు చేతకానిది నేను చేసి చూపించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతానంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారో అప్పుడే అన్ని పార్టీలకు వేడి పుట్టింది. ముఖ్యంగా అధికారంలో వైసీపీకి ఇది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది కనుక వెంటనే ఏపీ మంత్రులు తెలంగాణ ప్రభుత్వం, మంత్రులపై విరుచుకుపడుతూ సమస్యను విజయవంతంగా పక్కదారి పట్టించేశారు. అయితే అప్పుడు అన్ని ప్రగల్భాలు పలికిన తెలంగాణ మంత్రులు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి, నిర్వహణ, బొగ్గు సరఫరా, ఉత్పత్తి కొనుగోలుకి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్లు పిలువగా కేసీఆర్ హడావుడిగా సింగరేణి అధికారులను విశాఖకు పరుగులు పెట్టించారు. వారు అన్నీ పరిశీలించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధికారులతో మాట్లాడి వెళుతూ, టెండర్లు దాఖలు చేసేందుకు మరికొంత గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్ధన మేరకు మరో ఐదు రోజులు పొడిగించారు కూడా. కనుక సింగరేణి టెండర్ ఫారాలు పట్టుకొని వస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే అటు నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కనీసం రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండగా సింగరేణికి అంత స్థోమత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదీకాక కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టి కాపాడాలని నిర్ణయించిన తర్వాత, తెలంగాణలో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించని కేసీఆర్, పొరుగు రాష్ట్రంలో బిఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోశాయి.
ఇదీగాక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టినా ఆంధ్రా ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం లేదు. ఈ వ్యవహారంలో వేలుపెట్టవద్దని వైసీపీ మంత్రులు సున్నితంగానే చెప్పారు కూడా. ఆ తర్వాత ఫోన్‌లో కూడా మాట్లాడుకొనే ఉంటారు. కనుక కేసీఆర్ వెనక్కు తగ్గిన్నట్లున్నారు. అయితే ఇందుకు కేసీఆర్ మరో కొత్తకధ అల్లి చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి కధ అల్లుతారో చూడాలి.