AP

చంద్రబాబుకి విజయసాయి శుభాకాంక్షలు. వైసీపీలో మరో బ్లాస్ట్?

రాజకీయాలలో పదవులు, అధికారం ఎన్నడూ శాస్వితం కావనే విషయం అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్నప్పుడు చాలా మంది గ్రహించరు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వారిలో ఒకరు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివాడుగా చలామణి అయ్యారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ ఓ వెలుగువెలిగారు.

ఆ ఊపులోనే ఆయన చంద్రబాబు నాయుడుని, టిడిపిని అనరాని మాటలు చాలానే అన్నారు. సోషల్ మీడియాలో వేసిన సెటైర్లకు అంతే ఉండేది కాదు. ఏపీలో టిడిపి పని అయిపోయిందని, అందుకే చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్‌ పారిపోయి కరోనా వంకతో పార్టీ నేతలకి, ప్రజలకు కూడా మొహం చాటేస్తున్నారంటూ దారుణంగా కామెంట్స్ పెట్టేవారు.

మరొకరైతే ఆ విమర్శలకి రాజకీయ సన్యాసం తీసుకొని ఉండేవారేమో?కానీ అవతల ఉన్నది చంద్రబాబు నాయుడు! అపార పరిపాలన, రాజకీయ అనుభవం కలిగినవారు. సమస్యలలో నుంచే అవకాశాలను వెతుక్కొనే నైజం ఆయనది! అందుకే నేటికీ ఆయన ప్రజల మద్యనే ఉంటూ పార్టీని పటిష్టపరుచుకొంటూ మళ్ళీ అధికారం చేపట్టడానికి సిద్దం అవుతున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు కనబడకుండాపోతారన్న విజయసాయి రెడ్డి పరిస్థితే మారిపోయిందిప్పుడు. వైసీపీలో ఇప్పుడు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి భజన చేస్తున్నారే తప్ప ఆయనను తలుచుకొనేవారేలేరు. సజ్జల రెడ్డి కూడా దొరికిన ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకొంటూ గిరగిరా చక్రం తిప్పుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్: 2 స్థానంలో స్థానంలో నిలుస్తున్నారు. అయితే ముందే చెప్పుకొన్నట్లు రాజకీయాలలో ఎవరికీ ఏ స్థానం శాస్వితం కాదు కనుక ఏదోరోజు సజ్జల కూడా పక్కనపెట్టబడటం ఖాయమే. అది అప్రస్తుతం.

ఇక విషయానికి వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు పనైపోయిందని ఎద్దేవా చేసిన విజయసాయి రెడ్డే నేడు చంద్రబాబు నాయుడుకి ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం విశేషం. రాజకీయాలలో ఇది కామన్ అనుకోవచ్చు. ఇంతకు ముందు తారకరత్న చనిపోయినప్పుడు కూడా విజయసాయి రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మాట్లాడారు. కానీ అప్పుడు ఏమనుకొన్నారో తెలీదు కానీ ఇప్పుడు తాను ఎంతగానో ద్వేషిస్తున్న చంద్రబాబు నాయుడుకి విజయసాయి రెడ్డి ఇలా ట్విట్టర్‌లో బహిరంగంగా శుభాకాంక్షలు తెలపడం అంటే కవ్వించిన్నట్లే కదా?కనుక పర్యవసానాలు తీవ్రంగా ఉండొచ్చు. బహుశః విజయసాయి రెడ్డి అందుకు సిద్దపడే చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు చెప్పి ఉంటారు. కనుక త్వరలో వైసీపీలో మరో పెద్ద బ్లాస్టింగ్ జరుగబోతోందేమో? ఏమో?