జగన్ ప్రభుత్వం తలుచుకొని ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసును నాలుగు వారాలలో తేల్చేసేది. కానీ దానిలో అందరూ అసమదీయులే కావడంతో నాలుగేళ్ళయినా తేల్చనీయలేదు.
ఇదే మాట సీబీఐ న్యాయవాది మొన్న హైకోర్టులో కూడా చెప్పారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తమని ఆదేశించిందని, కానీ అవినాష్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిచినా కోర్టులో పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నారని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పింది.
సీబీఐ వాదనలు సహేతుకంగా ఉండటంతో ఇక నుంచి ప్రతీరోజూ తప్పనిసరిగా సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించి, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈనెల 25న మళ్ళీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది.
కానీ అవినాష్ రెడ్డి ఈవిదంగా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు లేదా మరో పిటిషన్ వేస్తుంటే మరో నాలుగేళ్ళయినా ఈ కేసు విచారణ పూర్తికాదు. బహుశః అవినాష్ రెడ్డి తదితరుల వ్యూహం కూడా అదే కావచ్చునని వివేకా కుమార్తె సునీతా రెడ్డి బాగానే గ్రహించారు. అందుకే నేడు ఆమె ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రేపు విచారణ చేపడతామని సిజేఐ చంద్రచూడ్ తెలిపారు. బహుశః అవినాష్ రెడ్డి కూడా ఇది ఊహించి ఉండరు. కనుక ఆయనకు మళ్ళీ టెన్షన్ మొదలైన్నట్లే!
అయితే అరెస్ట్ అనివార్యమని తెలిసినప్పుడు సీబీఐకి లొంగిపోయి చంచల్‌గూడ జైలులో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొన్న తర్వాత బెయిల్ సంపాదించుకొంటే మళ్ళీ ఇప్పట్లో జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా?భాస్కర్ రెడ్డి ఈవిషయం బాగానే గ్రహించిన్నట్లున్నారు కానీ ఆయన కుమారుడు అవినాష్ రెడ్డే గ్రహించిన్నట్లు లేదు. అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారనుకోవచ్చు.
కానీ ఇప్పుడు సునీతా రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లడంతో అవినాష్ రెడ్డి ముందస్తు ప్రయత్నాలు బెడిసికొట్టేలా ఉన్నాయి. ఈ కేసు విచారణను త్వరగా ముగించమని సుప్రీంకోర్టే సీబీఐని ఆదేశించింది కనుక అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ఆదేశిస్తే జైలుకి వెళ్ళకతప్పదు కదా? పాపం అవినాష్ రెడ్డి!