టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. రాజకీయాలలో ఆయనది విలక్షణ శైలి. రాజకీయాలంటే పదవులు, అధికారం అనుభవించడం కాదని, అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం పనిచేయడమని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు.
సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన తన ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపారు. ఆయన సమర్దతకు హైదరాబాద్ అతిపెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది.
చేతిలో చెల్లిగవ్వలేని పరిస్థితిలో ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణపనులు ప్రారంభించి కొంత వరకు పూర్తిచేశారు కూడా. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం నడుం బిగించి దశాబ్ధాలుగా పూర్తికాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించారు. అధికారం చేపట్టిన రెండుమూడు నెలల్లోనే విద్యుత్ కొరత సమస్యను పరిష్కరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనేక పరిశ్రమలను, పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయించారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్ళు ఆర్ధిక సమస్యలు, తెలంగాణ ప్రభుత్వంతో రోజూ ఇబ్బందులు, హైదరాబాద్‌లో ఉద్యోగులు-ఏపీలో పరిపాలన, రాజధాని భూసేకరణ, హుద్ హుద్ తుఫాను ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా మూడేళ్ళలో రాష్ట్రాన్ని గాడినపెట్టి చూపారు. ఆ తర్వాత పార్టీలో కొందరు మంత్రులు, నేతల తప్పుడు సలహాల కారణంగా బిజెపితో విభేదించడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.
నేటికీ వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేశాక అభివృద్ధి చేస్తామని చెప్పుకొంటోంది కానీ చంద్రబాబు నాయుడు ఆనాడే విశాఖ అభివృద్ధికి గట్టిగా కృషి చేశారు. ఆయన చొరవతోనే విశాఖలో పలు ఉన్నత విద్యాసంస్థలు, ఐటి సెజ్‌లో పలు ఐటి కంపెనీలు, అచ్యుతాపురం వద్ద పలురకాల పరిశ్రమలు, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వద్ద అనేక ఫార్మా కంపెనీలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పలు ఆటోమోబైల్ కంపెనీలు తరలివచ్చాయి. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. నమ్మకం. అని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా నమ్మేవారంటే అర్దం చేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు హయాంలో కృష్ణాగోదావరి నదులను అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తిచేసి కృష్ణా డెల్టాకు సాగునీరు అందించారు. అదేవిదంగా రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలకు త్రాగు, సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు.
రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు తనదైన ముద్రవేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు టిడిపి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. కేసీఆర్ పుణ్యమాని తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది కూడా. కానీ టిడిపిని కాపాడుకొని ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించడంతో కేసీఆర్ ఉలిక్కిపడేలా చేశారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పాలనపై దృష్టి పెడితే, ప్రతిపక్షంలోకి మారినప్పుడు పార్టీని చెక్కుచెదరకుండా కాపాడుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటారు. ఇదివరకు కేసీఆర్ తెలంగాణలో టిడిపిని తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిన్నట్లే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా టిడిపిని కనబడకుండా తుడిచిపెట్టేయాలని గత నాలుగేళ్ళుగా చేయని ప్రయత్నం లేదు. ఇటువంటి పరిస్థితులలో కూడా పార్టీ చెదిరిపోకుండా కాపాడుకోవడం మామూలు విషయం కాదు. కానీ చంద్రబాబు నాయుడు టిడిపిని కాపాడుకోవడమే కాక, మళ్ళీ పుంజుకొనేలా చేసి, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు కూడా.
సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు పరదాలు కట్టుకొని, షామియానాలు వేసుకొని, కూలర్లు, ఏసీలు పెట్టుకొని సభలు, సమావేశాలు నిర్వహించుకొంటుంటే, ఇంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు మండుఎండలను లెక్కజేయకుండా రోడ్ షోలు చేస్తూ పార్టీ శ్రేణులతో సమానంగా పనిచేస్తున్నారు!
2024 ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడు నమ్మకంగా చెపుతున్నారు. ఆయన నేతృత్వంలో టిడిపి పోరాడుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తుంది.