AP

ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్ కు పదే పదే సాంకేతిక సమస్యలు

పీలో సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్ కు పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యం కావడమో లేక రద్దు కావడమే జరిగాయి.

ఇవాళ మరోసారి అనంతపురం జిల్లాలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయలుదేరే సమయంలో మళ్లీ ఇలాంటి పరిస్ధితే తలెత్తింది.

వైఎస్ జగన్ ఇవాళ తొలిసారి సీఎం హోదాలో అనంతపురం జిల్లా శింగనమలలోని నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి సీఎం జగన్ పుట్టపర్తికి వెళ్లాల్సి ఉంది. దీంతో అధికారులు కూడా ఛాపర్ ను సిద్ధం చేశారు. కానీ సాంకేతిక లోపం ఏర్పడినట్లు చివరి నిమిషంలో గుర్తించారు. దీంతో జగన్ హెలికాఫ్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి వెళ్లారు.

గతంలోనూ పలుమార్లు సీఎం జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్లు మొరాయించాయి. దీంతో జగన్ ప్రయాణాల్లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సాంకేతిక సమస్యల్ని సరిదిద్ది ప్రయాణాలకు సిద్ధం చేస్తున్నారు. అయినా మళ్లీ మళ్లీ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్ధాయి వ్యక్తి ప్రయాణించే చాపర్ల విషయంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

గతంలో సీఎం జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ ఛాపర్ లోనే తిరుపతికి బయలుదేరి మార్గమధ్యంలో కూలిపోయి చనిపోయారు. ఆ ఘటన తర్వాత అయినా అధికారుల్లో మార్పు వచ్చినట్లు కనపడటం లేదు. వీఐపీలు ప్రయాణించే చాపర్లను ప్రయాణాలకు సిద్ధం చేసే విషయంలో ఎస్వోపీ ఉంటుంది. అలాగే ముందుజాగ్రత్తలు కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ అవేవీ పట్టించుకోవడం లేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.