AP

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశం

నంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది.

శైలజానాథ్ ఆహ్వానం మేరకే జేసీ ఆయనింటికి వెళ్లారని చెబుతున్నారు. కొంతకాలంగా శైలజానాథ్ టీడీపీలోకి వస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. శింగనమల నియోజకవర్గం నుంచి సాకే 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు.

ప్రాథమిక విద్యాశాఖ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2022లో జనవరి నుంచి నవంబరు వరకు ఏపీ పీసీసీ చీఫ్ గా పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డి, సాకే శైలజానాథ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం జేసీ సోదరులు టీడీపీలో చేరగా, సాకే మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లాకే చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాను రాజకీయాల నుంచి తప్పుకుందామని భావించానని, కానీ తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు రఘువీరా ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో రఘువీరా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కల్యాణదుర్గం నియోజకవర్గానికి మారి గెలుపొందారు. వైఎస్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా, ఆ తర్వాత కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోను మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు