AP

వైసీపీలో అంబటి రాయుడు-ముద్రగడ చేరికపై తేల్చేసిన సజ్జల

మరావతి: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనే ప్రచారం కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో సాగుతోంది.

అటు- వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకోవడం, ఇటు- అంబటి రాయుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం.. దీనికి కారణాలయ్యాయి.

వారి చేరికపై వైఎస్ఆర్సీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇప్పటివరకు రాలేదు. తాము వైఎస్ఆర్సీపీలో చేరబోతోన్నామంటూ ముద్రగడ గానీ, అంబటి రాయుడు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని, దానికంటే ముందు ప్రజలకు తాను ఏం చేయగలననేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందనీ వ్యాఖ్యానించాడు అంబటి రాయుడు.

ఈ పరిణామాల మధ్య వారిద్దరి చేరికపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. ముద్రగడకు మంచి జరగాలనే తాము కోరుకుంటామని సజ్జల అన్నారు. వైఎస్ జగన్ పనితీరు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, అలాగే- ముద్రగడ వస్తే పార్టీ ఆహ్వానిస్తామనీ చెప్పారు.

అంబటి రాయుడి చేరిక విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ- పార్టీలో యువతను వైఎస్ జగన్ ప్రోత్సహిస్తోన్నారని గుర్తు చేశారు. గతంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా యువత నేరుగా రాజకీయాల్లోకి రాలేకపోయిందని, జగన్ వచ్చిన తరువాత ఈ పరిస్థితిని మార్చివేశారని పేర్కొన్నారు. యువతకు తగిన ప్రాధాన్యత ఇస్తోన్నారని, ఫలితంగా కొత్త నాయకులు వస్తోన్నారని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి రావడం అంటే ప్రతిక్షణం ప్రజల కోసమే పని చేయాల్సి ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తోన్నారని సజ్జల చెప్పారు. ఎవరు వైసీపీలోకి వచ్చినా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు వెళ్లిపోయిన వారు ఉన్నారని, దీన్ని అధిగమించి జగన్ వెంట నడిచే వాళ్లూ చాలామందే ఉన్నారని పేర్కొన్నారు.

సిన్సియర్‌గా ప్రజలకు సేవ చేయాలనుకునే వారిని జగన్ ఖచ్చితంగా పార్టీలోకి స్వాగతిస్తారని అన్నారు. అంబటి రాయుడు విషయంపై తనకు పూర్తిగా సమాచారం లేదని, తాను కూడా సోషల్ మీడియాలోనే చూశానని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ చేసే పని తీరును చూసి అంబటి రాయుడు ఆకర్షితులయ్యారని, ఆయన సోషల్ మీడియా అకౌంట్లల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంటుందని వ్యాఖ్యానించారు. వాళ్లు (అంబటి రాయుడు-ముద్రగడ పద్మనాభం) రాజకీయాల్లోకి వస్తే మంచిదేనని పేర్కొన్నారు.