AP

టాప్ 10లో 3 కెనడా నగరాలు-అడుగున 5 భారత్ నగరాలు..

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఇవాళ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, స్థిరత్వం, మౌలిక సదుపాయాలు, పర్యావరణంతో సహా అనేక కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు.

ప్రతీ ఏటా ప్రకటించే గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ లో భాగంగా ఈ నగరాల పేర్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల పేర్లున్న ఈ జాబితాలో భారత్ కు మాత్రం నిరాశ తప్పలేదు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్ధానంలో నిలిచింది. వియన్నా తర్వాత, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ తన రెండో స్ధానాన్ని మరోసారి నిలుపుకుంది. ఆస్ట్రేలియా నగరాలు మెల్‌బోర్న్ , సిడ్నీ ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. కెనడాలోని ఏకంగా మూడు నగరాలు ఈ జాబితాలో టాప్ 10లో నిలిచాయి. వీటిలో కాల్గరీ, వాంకోవర్, టొరంటో ఉన్నాయి. స్విస్ నగరాలు జ్యూరిచ్ ఆరవ స్థానంలో, జెనీవా కాల్గరీతో ఏడవ స్థానంలో నిలిచింది. అలాగే జపాన్‌లోని ఒసాకా 10వ స్థానంలో నిలిచింది.

 

ఈ జాబితాలో భారత్ లోని ఐదు నగరాలకు చోటు దక్కింది. అయితే 173 నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై అత్యంత పేలవ ర్యాంకులు సాధించాయి. న్యూఢిల్లీ, ముంబై 141వ స్థానంలో , చెన్నై 144వ స్థానంలో ఉన్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు వరుసగా 147, 148 స్థానాల్లో నిలిచాయి.