APTrending News

బెదిరిస్తున్నారు: కేసీఆర్ కుటుంబీకులు బాధపడ్డారంటూ పార్టీ మార్పుపై ఈటల రాజేందర్

హైదరాబాద్: జాగ్రత్తగా ఉండాలంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మంగళవారం సాయంత్రం మాట్లాడారు.

సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని ఈటల అన్నారు.

బీజేపీ నేతలతో ఫొటో దిగితేనే బీసీ బంధు, దళితబంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు చెప్పకపోవచ్చు కానీ.. మరోసారి కేసీఆర్ గెలిస్తే మన బతుకులు ఆగమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు.

స్వేచ్ఛ ఉంటే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే సచివాలయంలోకి ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది. తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. తప్పకుండా తెలంగాణ బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

ఈసారి కేసీఆర్‌​కు ఓటు వేయవద్దని రైతులంతా భావిస్తున్నారని ఈటల రాజేందర్​ చెప్పారు. తెలంగాణ పల్లెల్లో బీఆర్​ఎస్​ ఓటమి తప్పదని మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మోడల్​ దేశానికి అందిస్తానన్న కేసీఆర్​.. ఇక్కడి ప్రజలకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు ఈటల.

బీజేపీ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందని.. పార్టీని వాడవాడలా తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌​లో కేసీఆర్​ వేసిన స్కెచ్​ వల్లే హుజురాబాద్​ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాని ఈటల రాజేందర్​ మండిపడ్డారు. కౌశిక్​ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్​.. ముదిరాజ్​లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.