AP

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే

జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే. భీమవరం సభలోనే తన అభిమానులకు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వారాహి యాత్ర ముగింపు సభలోనే పవన్ తాను చెప్పదలచుకున్నది తేల్చి చెప్పారు.

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన పవన్ ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే నివేదికలు.. పూర్తి సమాచారంతో పవన్ తన స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

భీమవరం సభలో సంకేతాలు : పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర భీమవరం సభతో ముగిసింది. ఈ సారి యాత్రలో పవన్ తాను సీఎం…జనసేన ప్రభుత్వం అంటూ రాజకీయంగా ఆసక్తిని పెంచే వ్యాఖ్యలు చేసారు. ఎక్కడా పొత్తుల అంశం ప్రస్తావన చేయలేదు. టీడీపీ పేరు ఎత్తలేదు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో వైసీపీ ఒక్కటి కూడా గెలవటానికి వీళ్లేదని పవన్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. ఇక్కడ ఈ సారి పవన్ తొలి నుంచి ఆశలు పెట్టుకున్నారు. అందులో భాగంగానే తన వారాహి యాత్రను గోదావరి నుంచే ప్రారంభించారు. రెండో విడత కూడా గోదావరిలోనే కొనసాగించనున్నారు. ఇదే సమయంలో చివరి సభగా భీమవరంలో తన పోటీ పైన పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

సర్వేలు..సమాచారంతో సిద్దం : పవన్ కల్యాణ్ తన యాత్ర ప్రారంభానికి ముందే సర్వేలు చేయించారు. అందులో భాగంగా తాను పోటీ చేసే స్థానాలు 8 ఎంపిక చేసుకొని అక్కడ స్థితి గతులు..ఓట్ బ్యాంక్..గెలుపు అవకాశాల పైన పూర్తి సమాచారం సేకరించారు. అందులో గతంలో తాను పోటీ చేసి ఓడిన గాజువాక, భీమవరంతో పాటుగా అన్నయ్య చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతి కూడా ఉన్నాయని సమాచారం.