AP

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 144వ రోజుకు

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 144వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది.

నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించారు. సర్వేపల్లి మీదుగా నెల్లూరు రూరల్‌లో ఎంట్రీ ఇచ్చారు.

వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, ఉదయగిరి.. వంటి నియోజకవర్గాల నుంచి వారంతా తరలి వచ్చారు.

 

ఈ సందర్భంగా నారా లోకేష్.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్యశ్రీ పథకంపై ఘాటు విమర్శలు చేశారు. ఉద్దేశపూరకంగా ఈ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ మండిపడ్డారు. లబ్దిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలకు దిగిందంటూ ఆరోపించారు. అంబులెన్స్‌లు మూలనపడ్డాయంటూ ధ్వజమెత్తారు. వైద్యారోగ్య శాఖకు అవినీతి అనారోగ్యం పట్టిందంటూ విమర్శించారాయన.

నారా లోకేష్ చేసిన ఈ విమర్శలపై మంత్రి విడదల రజిని స్పందించారు. ఈ సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. 2014- 2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, వైద్యారోగ్య రంగానికి అప్పుడు కేటాయించిన నిధులు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో విశ్వసనీయత పెరిగిపోతోందని, దాన్ని చూసి నారా లోకేష్ భరించలేకపోతున్నాడని విడదల రజిని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తోన్నామనే విషయంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చేసినట్టే ఆసుపత్రులనూ అభివృద్ధి చేస్తోన్నామంటూ విడదల రజిని అన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం జోరుగా సాగుతోందని, నంద్యాల వైద్య కళాశాలల సహా కొన్ని చోట్ల సీట్లు పెరగబోతోన్నాయని మంత్రి వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని వైద్య కళాశాలలు నిర్మించారంటూ ప్రశ్నించారు.