AP

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను(Amit Shah) కలిసిన తరువాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ ఆ తరువాత ఇందుకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) సైతం తమ క్యాడర్ కు పొత్తుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. బీజేపీతో పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ ఆయన చెప్పడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ? అనే విషయంలో క్లారిటీ ఎప్పటికి వస్తుందో అనే ఆసక్తి ఏపీ రాజకీయవర్గాల్లో నెలకొంది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అనే అంశంపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.

బీజేపీ మిత్రపక్షాల కూటమి (ఎన్డీఏ) సమావేశానికి టీడీపీని కూడా ఆహ్వానించినట్లు భారీగా ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తరువాత పరిణామాల్లో భాగంగా 2018లో ఈ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు ఎన్డీఏకు దూరంగా ఉన్న టీడీపీ గత కొద్దికాలంగా దగ్గరయ్యే దిశగా అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్లో ఎన్డీఏ పక్షాల కూటమి సమావేశం జరగనుంది. అనూహ్యంగా ఈ కూటమి సమావేశానికి రావాలని టీడీపీకి కూడా బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందనే చర్చ జరుగుతోంది. టీడీపీతో పాటు గతంలో ఎన్డీయేలో ఉన్న శోరోమణి అకాలీ దళ్ పాటు, రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీని కూడా ఆహ్వానించారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం వచ్చినట్టు టాక్.