ఏపీలో టీడీపీ సరైన వ్యూహాలను రూపొందిస్తోంది. చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి వెళుతున్నారు. వైసీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు.
గత కొద్ది రోజులుగా సాగునీటి ప్రాజెక్టులపై జగన్ సర్కార్ చేస్తున్న నిర్లక్ష్యంపై చంద్రబాబు పోరాట బాట పట్టారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గణాంకాలతో సహా వైఫల్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.దీనికి కౌంటర్ ఇవ్వడంలో జగన్ అండ్ కో ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది.అధికారపక్షం నుండి ఎటువంటి ఎదురుదాడి లేకపోవడం… ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో… చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో ప్రాజెక్టుల సందర్శనకు డిసైడ్ అయ్యారు.
సాగునీటి ప్రాజెక్టులపై వైసిపి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ప్రజల్లో భావన కలిగేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఆగస్టు ఒకటి నుంచి పెన్నా టు వంశధార పేరిట ప్రాజెక్టుల సందర్శనకు రెడీ అవుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఊపు తెస్తుందన్న నమ్మకం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.మొన్నటివరకు చంద్రబాబును రైతు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టడం పార్టీకి లాభిస్తుందని తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలో రిలాక్స్ గా ఉన్నారు. కనీసం చంద్రబాబు ఆరోపణలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. అంబటి రాంబాబు,జోగి రమేష్ లాంటి మంత్రులు మాట్లాడుతున్నా అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ మీడియా సంస్థల సర్వేలు చెబుతున్నాయి. బహుశా ఈ ధీమా తోనే చంద్రబాబు ఆరోపణలపై కౌంటర్ ఇచ్చేందుకు జగన్ అండ్ కో శ్రద్ధ చూపడం లేదు. దీనికి మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చివరిదాకా పోరాడడం చంద్రబాబు నైజం. ఆయన సక్సెస్ కు అది కూడా ఒక కారణం. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన పంధాను మార్చుకున్నారు. వైసీపీ సర్కార్ను వీధిలో నిలబెడుతున్నారు. కానీ వైసీపీ నుంచి చంద్రబాబును నిలువరించే ప్రయత్నాలు జరగడం లేదు. సాగునీటి రంగానికి వచ్చేసరికి గణాంకాలతో సహా వివరించాల్సి ఉంటుంది. కానీ వైసీపీలో ఆస్థాయి తెలివితేటలు ఉన్న నేతలు లేరు. లెక్కలను పక్కాగా వివరించడానికి తగిన తెలివితేటలున్న నేతలు క్యాబినెట్ తో పాటు సలహాదారుల్లో మచ్చు కైనా కానరావడం లేదు. ఇది ముమ్మాటికి వైసీపీకి లోటే. ఎన్నికలు సమీపించేసరికి చంద్రబాబు తన విశ్వరూపం చూపే అవకాశం ఉంది. జగన్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ చూసి ఆనందపడితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడంలో చంద్రబాబు ముందు వరుసలో నిలబడుతున్నారు. జగన్ అండ్ కో తేరుకోకుంటే రాజకీయంగా మూల్యం తప్పదు.