AP

నారా లోకేష్ కు ఫోన్ చేసిన చంద్రబాబు

‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు.

పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలను దగ్గరనుంచి తెలుసుకోవడానికి, వాటికి పరిష్కార మార్గం కనుగొనేందుకు పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని, ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ట్విటర్ లో రాశారు. ట్వీట్ తోపాటు పాదయాత్ర సమయంలో యువతతో లోకేష్ దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి యాత్రను ప్రారంభించారు. 4వేల కిలోమీటర్లు, 400 రోజులపాటు సాగే యాత్ర ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మోతుకూరులో పైలాన్ నుఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో యువగళం జాతరను తలపిస్తోంది.

లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తల్లి భువనేశ్వరితోపాటు కుటుంబ సభ్యులు లోకేశ్వరి, ఇందిర, హైమావతి, జయశ్రీ నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాపీ, ఎన్నిగళ్ల రాహుల్ తదితరులు లోకేష్ ను కలిసి పాదం కలిపారు. మరోవైపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్‌తో పాటు పలువురు నాయకులు లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.