అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు..
తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.
ఈ ఉదయం చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. సీఐడీ అధికారుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించారు.
మధ్యాహ్నం విరామ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని కోర్టు హాలులో చంద్రబాబును కలిశారు. సుదీర్ఘ విరామం అనంతరం ఆయన చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలా కాలంలో కేశినేని నాని టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటోన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు అరెస్ట్ కావడం, విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో మర్యాదపూరకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతోనే ఉన్నారు. మాజీ మంత్రి నారా లోకేష్, సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బయటికి వచ్చిన తరువాత విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పెట్టిన కేసులేవీ పస లేవని, ఆయనకు బెయిల్ లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేసులు పెట్టినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యాంచారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎదురుగాలి వీస్తోందని, దాన్ని డైవర్ట్ చేయడానికే ఇవన్నీ చేస్తోందని విమర్శించారు.