AP

మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు బెయిల్ కు మొగ్గు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు బెయిల్ కు మొగ్గు చూపారు.

సీఐడీ అరెస్టు తర్వాత బెయిల్ అడక్కుండా రిమాండ్ కు వెళ్లేందుకు మొగ్గు చూపిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చంద్రబాబు బెయిల్ ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ సాగింది. ఇవాళ మాత్రం చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ కోరారు.

స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసిన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉన్న తరుణంలో బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు విచారణ జరపనుంది.

స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ ఆయన్ను రెండు వారాల పాటు రిమాండ్ కు పంపింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ హౌస్ అరెస్టుకు ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టులో చంద్రబాబు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం సమయం కోరడంతో విచారణను వచ్చే సోమవారానికి వాయిదావేసింది. దీంతో చంద్రబాబు ఇవాళ ఏసీబీ కోర్టులో బెయిల్ కోరినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించగానే బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు మాత్రం దానికి మొగ్గు చూపలేదు. దీనికి బదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చంద్రబాబు ఈ కేసులో బెయిల్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదని అంతా భావించారు. కానీ హైకోర్టులో విచారణ ఆలస్యం అవుతున్న తరుణంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీన్ని సీఐడీ వ్యతిరేకించే అవకాశం ఉంది. సీఐడీ కస్టడీ కోరుతున్న పిటిషన్లో చంద్రబాబు లాయర్ల కౌంటర్ కు ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు కోరిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై వచ్చే తీర్పు ఉత్కంఠ రేపుతోంది.