AP

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు మెదపలేదు.

గతవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే తొలిరోజే చంద్రబాబు అరెస్టుపై చర్చ కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు నిరసనలకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తీవ్ర నిరసనలు చేశారు. అందులో భాగంగానే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు తిప్పడం, విజిల్స్ వేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. దీంతో స్పీకర్ బాలయ్యను హెచ్చరించి మిగతా ఎమ్మెల్యేల్లో కొందరిని సస్పెండ్ చేశారు. అయినా సీఎం జగన్ ఎక్కడా నోరు మెదపలేదు.

అనంతరం అసెంబ్లీలో పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇందులో తాజాగా కేబినెట్ ఆమోదించిన జీపీఎస్ బిల్లుతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, యూనివర్శిటీల బిల్లులు వంటివి ఉన్నాయి. వీటిపై చర్చలు జరిగిన తర్వాత ఆమోదించారు. అయితే ఈ బిల్లులపై చర్చల్లోనూ ముగింపులో సీఎం జగన్ మాట్లాడతారని భావించినా అలా జరగలేదు. చివరికి అసెంబ్లీలో చంద్రబాబు స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల వ్యవహారాలపై చర్చ జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు దీనిపై విమర్శలు చేశారు. అయినా జగన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు.

రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీకి సానుభూతి వస్తుందనే ఊహాగానాలు వస్తుండటం, జగన్ కక్షసాధింపుగా విపక్షాలు జనంలో ప్రచారం చేస్తుండటం, చంద్రబాబు విషయంలో ఓసారి స్పందిస్తే అన్ని చర్చల్లోనూ మాట్లాడాల్సి రావడం, అసలే జ్వరంతో బాధపడి కోలుకోవడం, ఇందులో ఏ కారణం చేతనో కానీ జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కేవలం తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతుంటే తాను మాత్రం చూస్తూ ఉండిపోయారు.