AP

. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలతోపాటు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని, అక్కడక్కడా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు పడతాయన్నారు. విజయనగరం, పశ్చిమగోదావరి, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో అత్యధికంగా 6.4 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 2.8, ఏలూరు జిల్లా పోలవరంలో 2.4, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 6.2, కాకినాడ జిల్లా పత్తిపాడులో 3.3, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 2.9, ఏలూరు జిల్లా భీమడోలులో 2.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 5.6 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా నగరిలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. వర్షాలు ఊపందుకోవడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. వాన ముసురుతో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతోపాటు కొన్ని జిల్లాల్లో రోడ్లపై నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.