AP

ఏపీలో గతంలో అమల్లో ఉన్న సీపీఎస్ ను రద్దు చేసి దాని స్ధానంలో ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్

ఏపీలో గతంలో అమల్లో ఉన్న సీపీఎస్ ను రద్దు చేసి దాని స్ధానంలో ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను తీసుకొచ్చింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదించిన బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించడంతో చట్టంగా కూడా మారింది.

అయితే ఏపీ గ్యారంటీ పెన్షన్ చట్టం 2023లో 33 ఏళ్ల సర్వీసుతో రిటైర్మెంట్ చేయించే నిబంధన ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగింది. దీనిపై తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఏపీ గ్యారంటీ పెన్షన్ చట్టం 2023లో 33 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరిగా రిటైర్మెంట్ చేయించే నిబంధన ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ క్లారిటీ ఇచ్చారు. జీపీఎస్ చట్టంలో అలాంటి నిబంధనేదీ లేదన్నారు. జీపీఎస్ చట్టంలో ఈ మేరకు పొందపరిచిన నిబంధనలపై ఆయన స్పష్టత ఇచ్చారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. దీంతో గ్యారంటీ పెన్షన్ చట్టంలో రిటైర్మెంట్ నిబంధనపై ఉద్యోగులకు క్లారిటీ వచ్చినట్లయింది.

జీపీఎస్ చట్టంలోని క్లాజ్ 4లో పేర్కొన్న అంశాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ఇవన్నీ కేవలం జీపీఎస్ ప్రయోజనాలు ఏయే దశల్లో ఎలా అందుతాయో చెప్పేందుకు మాత్రమేనని అధికారులు తెలిపారు. పాత పెన్షన్ విధానంలో ఉన్న అంశాలనే జీపీఎస్ విధానంలోనూ చేర్చాయన్నారు. ఈ నిబంధనలు గతంలో 1961లో రూపొంచినవేనని గుర్తుచేశారు. వాటిని 1980లో సవరించారని, అవే ఇప్పుడు జీపీఎస్ చట్టంలో చేర్చామని తెలిపారు.

అంతే కాదు పాత పెన్షన్ పధకంలో 33 ఏళ్ల సర్వీసు అనేది పూర్తి పెన్షన్ పొందేందుకు అర్హతగా ఉందని, స్వచ్చంద పదవీ విరమణ నేపథ్యంలో 20 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ అందేలా నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ నిబంధననే ఇప్పుడు జీపీఎస్ లోనూ చేర్చినట్లు వెల్లడించారు. కాబట్టి గ్యారంటీ పెన్షన్ పథకంలో ఉద్యోగుల్ని 33 ఏళ్ల సర్వీసు తర్వాత పదవీ విరమణ చేయిస్తామనేది సరికాదన్నారు.