AP

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ పోరాడి, అనంతరం స్ధానిక ఎన్నికల్లో తన పంతం నెగ్గించుకుని మరీ రిటైర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీ ఇచ్చారు.

తాజాగా ఏపీలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్ధ తరఫున రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల అక్రమాలపై పోరాటం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ ఎన్నికల ప్రధానాధికారికి నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశారు.

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీన విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో స్వేచ్ఛాయిత ఎన్నికలు – ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఫోరం కార్యదర్శిగా హాజరైన నిమ్మగడ్డ.. ఎన్నికల నిర్వహణపై కీలక ప్రసంగం చేశారు. అనంతరం వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు వీలుగా అందులో లోపాలపై పోరాటం ప్రారంభించారు. ఇవాళ సీఈవో ముకేష్ కుమార్ మీనాను కలిసిన ఆయన.. నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశారు.

ఇవాళ ఎన్నికల ప్రధానాధికారికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శిగా ఓట్ల నమోదులో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధ్యాపకులకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది చేపట్టారని,

సిబ్బందికి అనుభవం లేక జాబితాలో తప్పులు దొర్లుతున్నాయన్నారు. బీఎల్ఓల అనుభవ రాహిత్యంతో జాబితాలో తప్పులు దొర్లుతున్నాయన్నారు.

వీరి తప్పిదాలతో ఓటర్లు రైట్ టు ఓట్ ను కోల్పోతున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు. ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తమ ఫోరం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దృష్టికి వచ్చిందని తెలిపారు. భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని,ఒకే డోర్ నవంబర్ పై వందలాది ఓటర్ల నమోదు జరిగినట్లు తెలిసిందన్నారు. ఇటీవల కాగ్ నుంచి కూడా గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్నారు.

కాబట్టి ఓటర్ల జాబితా తయారీలో గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది జోక్యాన్ని తప్పించాలని నిమ్మగడ్డ కోరారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై రాజకీయ నేపథ్య ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణల నేపథ్యంలో వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఉపాధ్యాయులకు అపార అనుభవం ఉందని తెలిపారు. కాబట్టి అనుభవం గల టీచర్లకు ఎన్నికల ప్రక్రియ అప్పగించాలన్నారు.