AP

స్కిల్ స్కామ్‌లో కిలారి రాజేష్‌ కీ రోల్..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీలో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో భేటీ కానున్నారు.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో- దీనిపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టింది. తన కేసులను మాఫీ చేయించుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలకు తెర తీసింది. రాజకీయంగా టీడీపీని ఎదుర్కొనే ధైర్యం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది.

దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారమే చేస్తూనే ఉంటారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించడానికే జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లారని, చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తమ హయాంలోనే అధికంగా వచ్చాయని గుర్తు చేశారు.

ఈ మధ్యాహ్నం సజ్జల విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కేసుల గురించి ప్రధాని మోదీతో మాట్లాడాల్సిన అవసరం జగన్‌కు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కోర్టు ఆదేశాలతోనే చంద్రబాబు జైల్లో ఉన్నారని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి వైఎస్ జగన్ కేంద్రంతో మాట్లాడతారే తప్ప, చంద్రబాబు కేసుల గురించి కాదని చెప్పారు.

విదేశాలకు పారిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ త్వరగా తిరిగి వస్తే కేసు తేలుతుందని సజ్జల అన్నారు. కేసు త్వరగా తేల్చడానికి చంద్రబాబు అయినా పీఎస్ శ్రీనివాస్‌ను త్వరగా రమ్మని చెప్పాలని సూచించారు. చంద్రబాబు కేసులో ఆయన తరపు న్యాయవాదులు కూడా టెక్నికల్ అంశాల పైనే మాట్లాడుతున్నారు తప్పు చేయలేదని అనట్లేదని అన్నారు.

ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును న్యాయస్థానం రిమాండ్‌కు తరలించిందని అన్నారు. చంద్రబాబు కేసులతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు ఖాతాల్లోకే స్కాం డబ్బులు వెళ్లినట్లు సీఐడీ తేల్చి చెప్పిందని వివరించారు.

ఈ స్కామ్‌లో నారా లోకేష్‌ సన్నిహితుడు కిలారి రాజేష్‌ పాత్ర కీలకంగా ఉందని అన్నారు. స్కిల్ స్కామ్‌ గురించి టీడీపీ ఎందుకు మాట్లాడట్లేదని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ నేతలు, ఎల్లోమీడియా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జడ్జీలు, లాయర్లను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, దీన్ని బట్టి చూస్తే వారి ఫ్రస్టేషన్‌ పీక్‌ స్టేజ్‌కు చేరిందని విమర్శించారు.