AP

వైసీపీలో `పులివెందుల` సతీష్ రెడ్డి: చేరిక తేదీ ఇదే..!!

కడప: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.

ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీలో వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ- వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది వైసీపీలోకి. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ జగన్. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఆ తరువాత కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్.. తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువాను కప్పి జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

తాజాగా- తెలుగుదేశం పార్టీకే చెందిన మరో సీనియర్ నేత వైఎస్ఆర్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన అనుచరులు సైతం జగన్‌ను కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఆ టీడీపీ నేత మరెవరో కాదు. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన ఎస్ వీ సతీష్ కుమార్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు ఆయనే. జిల్లా మొత్తం మీద టీడీపీలో చెప్పుకోదగ్గ స్థాయి నాయకుడెవరైనా ఉన్నారంటే అది సతీష్ రెడ్డే.

అలాంటి నేత ఇక వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరార్ చేసుకున్నారు. తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కడప జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ ఇది. ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లడంతో కడప జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయినట్టేనని చెబుతున్నారు.

రూ.2,000 నోట్లపై వాస్తవ విషయాలను వెల్లడించిన ఆర్బీఐ

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రెండుసార్లు, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు సతీష్ రెడ్డి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చేతిలో 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో పరాజయాన్ని చవి చూశారు. ఇప్పుడు వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.