AP

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. సైట్ మార్చిన ttd

తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ ను మార్చింది. ప్రస్తుతం tirupatibalaji.ap.gov.in అని ఉండగా.. తాజాగా ఆ పేరును
ttdevasthanams.ap.gov.in
అని మార్చారు.

ఈ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్’లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్
tirupatibalaji.ap.gov.in
ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తెలియజేశారు.

భక్తులు ఇకనుంచి
tirupatibalaji.ap.gov.in
కాకుండా ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం
ttdevasthanams.ap.gov.in
వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అయితే అప్పటికీ అది టీటీడీ పేరిట స్వతంత్ర వెబ్ సైట్‌గా ఉండేది. ఆ తర్వాత సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ
tirupatibalaji.ap.gov.in
గా మార్చారు. తాజాగా దాన్ని కూడా మార్చారు.

ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులకు సంబంధించిన జనవరి నెల కోటాను విడుదల చేశారు. ఆర్జిత సేవల కోసం ఈరోజు నుంచి 20వ తేదీ ఉదయం పదిగంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందినవారు అక్టోబరు 22వ తేదీన మధ్యాహ్నం 12.00 గంటల్లోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలి.

ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం టికెట్లను ఈనెల 21వ తేదీ ఉదయం పదిగంటలకు విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం పదిగంటలకు విడుదల చేస్తారు.