Uncategorized

ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే ? రెండే లక్ష్యాలతో వైసీపీ అడుగులు-టార్గెట్ 2024…

వై ఏపీ నీడ్స్ జగన్ : ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి 2019 ఫీట్ ను రిపీట్ చేయడంతో పాటు అంతకంటే మెరుగ్గా 175/175 ఫలితాన్ని సాధించేందుకు అధికార వైసీపీ అడుగులేస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలతో పాటు వై ఏపీ నీడ్స్ జగన్ ( జగన్ ఎందుకు కావాలి) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం క్యాడర్ ను ముందుగా సన్నద్ధం చేస్తోంది. సీఎం జగన్ నేరుగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించబోతున్నారు.

సరికొత్తగా జనంలోకి : గతేడాది కాలంగా గడప గడపకూ ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లి అందరి కంటే ముందు తామేం చేశామో, ఏం చేయగలమో చెప్పేసిన అధికార వైసీపీ.. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరో కార్యక్రమంలో జనంలోకి వెళ్లబోతోంది. ఇన్నాళ్లు చేసిన సంక్షేమాన్ని గుర్తుచేస్తూ జగన్ తోనే ఇవన్నీ సాధ్యమనే భావనను వారిలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ముందుగా పార్టీ క్యాడర్ ను ఈ కార్యక్రమం కోసం సిద్దం చేస్తోంది.

వై ఏపీ నీడ్స్ జగన్ శిక్షణా శిబిరాలు : వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీకి బాగా పట్టున్న కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పార్టీ క్యాడర్ కు శిక్షణా శిబిరాలను ప్రారంభించింది. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీవై రామయ్య, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలోని అర్బన్ మండలంలో క్యాడర్ కు “వై ఏపీ నీడ్స్ జగన్” శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని అర్బన్, రూరల్, పెద్దముడియం మండలాల్లో క్యాడర్ “వై ఏపీ నీడ్స్ జగన్” శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

రెండే లక్ష్యాలు- నేరుగా సీఎం పర్యవేక్షణ : వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా వైఎస్సార్ సీపీ రెండు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఇందులో మొదటిది సీఎం జగన్ ప్రతి బహిరంగ సభలో చెబుతున్న వై నాట్ 175 నినాదాన్ని నిజం చేసేలా పార్టీ పనిచేయడం, రెండోది ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలంటే అనే నినాదంతో ప్రతి గడపకు వెళ్లి గత నాలుగున్నరేళ్ల పాలనలో వైఎస్సార్ సీపీ చేసిన మంచిని ప్రజలకు రాతపూర్వకంగా వివరించడం. ఈ రెండు లక్ష్యాలతో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ నిర్వహించనుంది.

వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం సాగేది ఇలా : వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కోసం ముందుగా సీఎం జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు పార్టీ ప్రతినిధుల సదస్సులో కూడా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఈ కార్యక్రమం ఎలా చేపట్టాలో సూచించారు. తాజాగా జరిగిన ప్రతినిధుల సదస్సు తర్వాత పార్టీ ఆదేశాలతో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో క్యాడర్ కు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. వై ఏపీ నీడ్స్ జగన్ నిర్వహణ, క్యాంపెయిన్ లో ప్రజలను అడగాల్సిన ప్రశ్నలు, ఆ తరువాత వారికి రసీదు ఇవ్వడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షులు, కన్వీనర్ల సారథ్యంలో జరిగే ఈ క్యాంపెయిన్ తో వైసీపీ ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనుంది.