AP

విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాం

విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ సెక్టారులో స్కాంల సీక్వెలును ప్రభుత్వం తెర లేపిందన్నారు. పవర్ స్కాంలని పార్టులు పార్టులుగా బయట పెడతామని ఆయన వ్యాఖ్యానించారు. రూ. 7 వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని మేం బయటపెట్టామని, స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో పిల్ వేశాను.. త్వరలో విచారణకు రాబోతోందన్నారు. అరబిందో.. షిర్డీ సాయి అనేవి జగనుకు దత్తపుత్రులు అని, ఈ రెండు సంస్థలకు పుట్టిన విష పుత్రిక ఇండో సోల్ సంస్థ అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘ఇండోసోల్ ప్రాజెక్టుకు సోలార్ ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు. విద్యుత్ రంగంలో భారీ ఎత్తున ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం జరిగింది. వివిధ కెపాసిటీలతో ఉన్న ఒక్కో ట్రాన్సఫార్మరులోనే రూ. 1 లక్ష నుంచి రూ. 8 లక్షల వరకు దోపిడీ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ట్రాన్సఫార్మర్ల కంటే చాలా అధిక మొత్తంలో ఏపీలో ధరలు ఉన్నాయి. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 62 శాతం మేర ఆర్డర్లు షిర్టీ సాయి సంస్థకే వెళ్తున్నాయి. షిర్టీ సాయి సంస్థకు నాసిరకం ట్రాన్సఫార్మర్ల సరఫరా చేస్తోందనే అంశంపై గత ప్రభుత్వం పెనాల్టీ విధించింది. గత ప్రభుత్వం విధించిన ఆ పెనాల్టీని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. పెనాల్టీ రద్దు వెనుక మరో స్కాం ఉంది.
పవర్ స్కాం పార్ట్-2లో మరిన్ని వివరాలు బయటపెడతా. దీన్ని వదిలి పెట్టేదే లేదు.. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. ప్రతి ఒక్కరూ ఆధారపడే విద్యుత్ రంగంలో భారీ దోపిడీనా..? ఈ స్కాంల వల్లే పేదలపై విద్యుత్ భారం.’ అని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.