ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపుతోంది. తిరుపతిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఈ చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
ఏపీలో చెడ్డీగ్యాంగ్ మూడేళ్లుగా తిరుగుతోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేశారు. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో గోడదూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి లూటీ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతోంది ఈ చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కదలికలతో ప్రజలను అప్రమత్తం చేశారు పోలీసులు.