AP

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టు కీలక నిర్ణయం..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లకూ, ప్రభుత్వ న్యాయవాదులకూ మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉంటున్న చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇవాళ రెగ్యులర్ బెయిల్ పై వాదనలు సాగాయి.

 

Advertisement

ఇవాళ ముందుగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు మెడికల్ రిపోర్టులలో తప్పులు ఉన్నాయని వాదించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా స్కిల్ స్కాంలో కోట్లు చేతులు మార్చారని పేర్కొన్నారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు ఈ మొత్తం తరలించారని కోర్టు దృష్టికి తెచ్చారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం వెల్లడైందన్నారు. బోస్, ఖన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తేలిందని, సీమెన్స్ సంస్ద ఈ విషయం నిర్ధారించిందన్నారు.

 

Advertisement

ap high court reserved verdict on chandrababu regular bail plea in skill case

అనంతరం చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇందులో ఆయన ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. బెయిల్ పై విచారణ జరుగుతున్న తరుణంలో స్కిల్ కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టును కోరారు. అలాగే ఈ కేసుపై 2018 నుంచి విచారణ జరుగుతున్నట్లు చెప్తున్నారని, అటువంటప్పుడు ఇప్పుడు హడావిడిగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీమెన్స్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండానే ఫోరెన్సిక్ ఆడిట్ ముగించిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు.

 

దీంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వు చేసింది. త్వరలో ఈ తీర్పు ఎప్పుడు ప్రకటిస్తుందే హైకోర్టు వెల్లడించనుంది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నందున ఈ గడువు ముగిసేలోపు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పై తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుపై ఇతర కేసుల్లో చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు సీఐడీ కూడా హామీ ఇచ్చింది.