AP

విశాఖ మత్స్యకారులకు రూ.7 కోట్లు నష్టపరిహారం చెల్లించిన జగన్ ప్రభుత్వం..!

నవంబర్ 19వ తేదీన విశాఖ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోటు ఓనర్లకు జగన్ ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు రూ.7.11 కోట్లు చెక్కును బోటు ఓనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఉత్తరాంధ్ర రీజియనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేఫ్, వైసీపీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యశాఖ కార్పొరేషన్ ఛైర్మెన్ పేర్ల విజయ్ చందర్‌లు ఉన్నారు.

 

అగ్నిప్రమాదంలో ధ్వంసమైన బోట్లకు సంబంధించిన 30 మంది ఓనర్లకు రూ.7.1 1 కోట్లు నష్టపరిహారం చెల్లించినట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మీ చెప్పారు.అదే విధంగా స్వల్పంగా ధ్వంసమైన బోట్లకు రూ.66.96 లక్షలు పరిహారం చెల్లించినట్లు వివరించారు.బోటు డ్యామేజీ తీవ్రతను బట్టి పరిహారం చెల్లించినట్లు విజయలక్ష్మీ తెలిపారు.

 

ఇక స్వల్ప డ్యామేజీ జరిగిన బోట్లకు సంబంధించిన 384 మంది ఓనర్లకు రూ.10వేలు ప్రభుత్వం అందజేసింది. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రతను తెలుసుకుని మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే సీఎం జగన్ స్పందించి ఆదుకున్నారని గుర్తుచేశారు. రెండు నెలల పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే ఉన్న సమయంలో ప్రభుత్వం వారికి రూ.10వేలు ఇచ్చి ఆదుకుంటోందని అదే సమయంలో బోటుకు వినియోగించే లీటర్ డీజిల్ పై రూ.9 సబ్సిడీ ఇస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.

 

ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ కోసం రూ.150 కోట్లను శాంక్షన్ చేసినట్లు చెప్పిన మంత్రి ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.ఇక బైయో డీగ్రేడబుల్ బోట్లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి చెప్పారు. తెలుగుదేశం ప్రభత్వం హయాంలో డ్యామేజ్ అయిన బోట్లకు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పిన మంత్రి సీదిరి అప్పలరాజు… హుదుద్ తుఫాను సందర్భంగా ధ్వంసమైన బోట్లకు ఇప్పటికీ పరిహారం పూర్తి స్థాయిలో అందలేదని చెప్పారు.