AP

వైజాగ్ ఫిషింగ్ హార్భర్ ఘటనలో కీలక ఆధారాలు-సీసీటీవీ ఫుటేజ్ లో టైమ్ నిర్ధారణ..

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఘటనలో అనూహ్యంగా బోట్లు కాలిపోయి మత్సకారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు గల కారణాలపై తలోమాట మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ పోలీసులు ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనకు ముందు సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

 

ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి పోలీసులు విడుదల సీసీటీవీ ఫుటేజ్ లో కీలక ఆధారాలు దొరికాయి.అగ్ని ప్రమాదం సంభవించడానికి కొద్ది నిమిషాల ముందు ప్రమాదానికి గురైన బోట్ నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వస్తున్నట్లు ఈ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నుంచి ఈ ఫుటేజ్ సేకరించారు. ఇందులో అగ్ని ప్రమాద ఘటనకు ముందు ఏ జరిగిందో ఉంది.

 

దీని ప్రకారం ఈ నెల 19వ తేదీ రాత్రి 10.48 గంటలకు ఇద్దరు వ్యక్తులు బోటులో నుంచి బయటకు వస్తున్నట్టు సీసీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. అలాగే తొలిసారిగా మంటలు వచ్చింది 10.50 గంటలకని పోలీసులు నిర్దారించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరన్న దాని పై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వారిని గుర్తించే పనిలో విచారణా బృందాలు ఉన్నట్లు తెలుస్తోంది.అగ్ని ప్రమాద ఘటన తో వారికి సంబంధం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే లభించిన ఆధారాలను ఈ ఫుటేజ్ తో పోల్చి చూసి ఓ నిర్ణయానికి వారు రావొచ్చని తెలుస్తోంది.

 

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో నిందితులు, ఘటనకు గల కారణాన్ని గుర్తించడంలో జరిగే ఆలస్యం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్న వారిని విచారించి వారి నుంచి సేకరించిన సమాచారంతో క్షేత్రస్ధాయిలో విచారణ జరుపుతున్నారు.