AP

జనసేన సీట్లు ఫైనల్, 30-2 : పవన్, నాగబాబు స్థానాలు ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పైన ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు ఆ పార్టీ నుంచి స్పష్టత వచ్చిన తరువాత అధికారికంగా సీట్లను ప్రకటించనున్నారు. తాజాగా జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ సీట్లను ప్రతిపాదించింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఆ సమయంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

 

ఎన్నికల కసరత్తు: ఏపీలో టీడీపీ, జనసేన ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. జగన్ ను ఓడించటమే తమ లక్ష్యమని ఇప్పటికే పవన్ ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ కోరుతున్నారు. తెలంగాణ ఫలితాల తరువాత బీజేపీ వైఖరి పైన స్పష్టత రానుంది. బీజేపీ నిర్ణయం తరువాతనే టీడీపీ, జనసేన సీట్ల గురించి అధికారికంగా ప్రకటన చేయాలని నిర్ణయించారు.

 

ఇప్పటి వరకు అందుతున్న సమచారం మేరకు జనసేనకు తొలుత 20 స్థానాలకు టీడీపీ ఒప్పించే ప్రయత్నం చేసింది. మూడు నెలల కాలంగా చోట చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు 30 అసెంబ్లీ..2 లోక్ సభ సీట్లకు అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో పొత్తు ఖరారు అయితే, చివరి నిమిషంలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక, ఈ ఎన్నికల్లో జనసేనాని పవన్, మెగా బ్రదర్ నాగబాటు పోటీ చేసే స్థానాలపైనా స్పష్టత వచ్చింది.

 

సీట్ల పై క్లారిటీ: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి జనసేన సిద్దం అవుతోంది. ప్రతీ లోక్ సభ స్థానంలో రెండు సీట్లు చొప్పున ఇవ్వాలని జనసేన ప్రతిపాదించింది. అయితే, 50 సీట్లు సాధ్యం కాదని టీడీపీతో జరిగిన చర్చల్లో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. అంతిమంగా 30 సీట్లకు అంగీకారం కుదిరిందని తెలుస్తోంది.

 

ప్రధానంగా విశాఖ, ఉభయ గోదావరి, క్రిష్టా జిల్లాల్లో ఎక్కవ స్థానాలు జనసేనకు కేటాయిస్తూనే…కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ జనసేన సీట్లను కోరటంతో సమ్మతించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో తిరుపతి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి పవన్ పోటీ దిశగా సర్వే చేయిస్తున్నారు. ఫలితం ఆధారంగా రెండో సీటు ఖరారు అవుతుందని చెబుతున్నారు.

 

చంద్రబాబు – పవన్ బేటీ: ఇక, లోక్ సభ స్థానాల్లో రెండు సీట్లు జనసేనకు ఇవ్వనున్నారని సమాచారం. అందులో కాకినాడ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీకి దిగనునున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాగబాబు పోటీకి సిద్దంగా లేనని చెబుతున్నా..ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతుండటంతో పోటీకి ఒప్పించినట్లు సమాచారం. కర్నూలు లేదా నెల్లూరు లోక్ సభ సీట్లలో ఒకటి జనసేనకు ఇస్తారంటూ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

 

ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉందనే అంచనాలతో అక్కడే ఎక్కవ సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇక, రెండు మూడు రోజుల్లోనే చంద్రబాబు తో పవన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి ప్రచారం..సభల నిర్వహణ..బీజేపీతో పొత్తు..సీట్ల పైన ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.