టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత విజయవాడకు వచ్చారు. ఇక్కడ పార్టీ అధినేతకు తెలుగుదేశం శ్రేణులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం లభించింది.
తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగానే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, కొంతమంది సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి.
టీడీపీ ర్యాలీ సమయంలో గన్నవరం ఎయిర్ పోర్ట్, జాతీయ రహదారి పరిసరాల్లో పోలీసులు భారీగా మొహరించారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ టీడీపీ కార్యకర్తలను నిలువరించే పోలీసులు యత్నించారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా టీడీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు.
టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యూత్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూల వర్షంతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.