TELANGANA

సీఆర్ఎఫ్ ఆధీనంలోకి నాగార్జున సాగర్.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల విడుదల విషయంలో నవంబర్ 28న ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని కేంద్రహోంశాఖ కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది.

 

నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతోపాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ వివాదంపై సమీక్షించారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

 

నవంబర్ 29న రాత్రి నాగార్జున సాగర్ డ్యామ్ పైకి 500 మంది ఏపీ పోలీసులు వచ్చారని తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. వారు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. సాగర్‌ 5, 7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ చర్యతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ , భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది.