AP

కులం పేరుతో వైసీపీ ట్రాప్.. జనసైనికులకు పవన్ హెచ్చరిక..

ఎలాంటి భావజాలం లేని పార్టీ వైసీపీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, టీడీపీ పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. వైసీపీ వాళ్లకు తనను విమర్శించే హక్కులేదన్నారు. కులం పేరుతో వైసీపీ చేసే ట్రాప్ లో కార్యకర్తలు పడొద్దన్నారు.

 

తానేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందన్నారు. సమాజాన్ని ఎలా చూస్తామనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తాను మొదటి నుంచీ పదవులు కోరుకోలేదన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అనుకున్నానని స్పష్టం చేశారు.

 

తెలంగాణలో పోలింగ్ పైనా పవన్ కల్యాణ్ స్పందించారు. నగర ప్రాంతాల్లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్నారు. జనసేనకు యువతే పెద్ద బలమని పేర్కొన్నారు. తమ పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో జనసేనకు ప్రస్తుతం ఆరున్నర లక్షల కేడర్‌ ఉందని వివరించారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని గర్వం రాకూడదన్నారు. పొరుగు రాష్ట్రాల యువత కూడా తనకు మద్దతిస్తున్నారని చెప్పారు.

తన భావజాలాన్ని నమ్మే యువత.. వెంట వస్తున్నారన్నారు. యువత ఆదరణ చూసి తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.