ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఏపీతో పాటు వచ్చే ఏడాది పెండింగ్ లో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏపీలో ఈ నెలలో రెండు రోజుల పాటు పర్యటించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలో ఈసీ టూర్ ఖరారైంది.
ఏపీలో ప్రస్తుతం ఓటర్ల తుది జాబితా తయారవుతోంది. జనవరి 5 నాటికి ఈ తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించబోతోంది. అంతకంటే ముందే ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించబోతోంది. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు జరుగుతోందన్న ఫిర్యాదులు, అదే సమయంలో అధికార వైసీపీ కూడా ఓట్ల తొలగింపుతో పాటు తెలంగాణలో ఓటు వేసిన వారు తిరిగి ఇక్కడ ఓటు వేయకుండా అడ్డుకోవాలని కోరుతున్న నేపథ్యంలో ఈసీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే వైసీపీ, టీడీపీ నేతలు రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు భారీ ఎత్తన ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ఆయన తీసుకుంటున్న చర్యలపైనా విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈసీ ఆదేశాలను 8 జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని, అయినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై రేపు విపక్ష నేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 22, 23 తేదీల్లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాజకీయ పార్టీలతో సమావేశమై వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించబోతోంది. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.