TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు, పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు.

 

రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా.. రేవంత్ రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు. అయితే, రేవంత్ తన స్వంత కారులోనే బయల్దేరి ఎల్లా హోటల్ కు వెళ్లారు. రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరామ్ నాయక్, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

ఎల్లా హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాగా, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు, తెలుగు రాష్ట్రాల సీఎం, మాజీ సీఎంలకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు పంపారు.

 

రేవంత్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై స్పందించే అవకాశం ఉంది. ఏ హామీని మొదట అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

 

కాగా, హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితరులను రేవంత్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలను కూడా ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు రేవంత్.

 

revanth reddy to take oath as telangana chief minister in next few hours

తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనీయా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు.

 

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శకపాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. అందుకే 2023, డిశంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయబోతోంది అని సందేశాన్ని ఇచ్చారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ రావల్సిందిగా ఇదే నా ఆహ్వానం అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.