TELANGANA

తెలంగాణాలో త్వరలో మరో ఎన్నికల పండుగ : సన్నాహాలు మొదలెట్టిన ఈసీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఇటీవలే అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నికల పండుగ ముగిసింది. ఇప్పుడు మరో ఎన్నికల పండుగకు ముహూర్తం ఖరారయింది. నిన్నా మొన్నటి దాకా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడి నుండి ఇంకా రాజకీయ పార్టీలు ఊపిరి తీసుకోక ముందే మళ్లీ త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది.

 

తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకోక ముందే వెంటనే మళ్ళీ ఎన్నికలు రావడం ఆసక్తిగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో ఎన్నికలు రాబోతున్నట్టు ఎన్నికల కమీషన్ తన చర్యల ద్వారా స్పష్టం చేసింది . రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్టు పేర్కొంది.

 

వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమీషన్. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీలలో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1 తో పూర్తి కానుంది. ఈ క్రమంలో సర్పంచ్,వార్డు మెంబర్ ల రిజర్వేషన్ లపై వివరాలు పంపాలని జిల్లా అధికారులను స్టేట్ ఎన్నికల కమీషన్ కోరింది.

 

గ్రామ పంచాయతీల ఎన్నికలకు నగారా మోగించేందుకు అన్ని సన్నాహాలు మొదలు పెట్టినట్టు తాజా పరిణామాలతో స్పష్టం అవుతుంది. ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు కూడా సిద్ధం కావాల్సి ఉంది. మరి ఈ స్థానిక సంస్థల బరిలో అమీతుమీ తేల్చుకోవటం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఎలా సిద్ధం అవుతాయి అనేది తెలియాల్సి ఉంది.

 

ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది . ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమి పాలుకాగా ప్రతిపక్షానికి పరిమితమైంది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి తనదైన మార్క్ పాలన సాగించనుంది.