APTELANGANA

‘ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం అదే’

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా చంద్రబాబును అరెస్టును ఖండించారు. అయితే, నందమూరి కుటుంబంలో కీలక సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఇటీవల నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. కొందరు స్పందించకుంటే ఏంటీ? డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌(Jr NTR)కు సన్నిహితుడైన సినీ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) ఈ విషయంపై స్పందించారు. వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటం వల్లే చంద్రబాబు అరెస్టు విషయంపై ఎన్టీఆర్ స్పందించకపోయి ఉంటారని తాను భావిస్తున్నట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ సినిమా, మధ్యలో కరోనా ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ కనీసం నాలుగు సినిమాలు చేసేవాడు. ప్రస్తుతం ఆయన ‘దేవర’లో నటిస్తున్నారు. అది చాలా పెద్ద సినిమా. పైగా రెండు భాగాలుగా వస్తోంది అని రాజీవ్ కనకాల చెప్పారు. నటన అంటే అతనికి ఎంతో ఇష్టం. దీంతో పూర్తి సమయం సినిమాకే కేటాయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపైనే దృష్టి పెట్టాలని భావించి ఉంటారని రాజీవ్ కనకాల తెలిపారు.

మరోవైపు, తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంపై రాజీవ్ కనకాల స్పందించారు. రాజకీయాలకు సమయం కేటాయించగలనని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తానని తెలిపారు రాజీవ్ కనకాల. రాజకీయాల్లోకి రావాలంటే ముందు వాటిని అధ్యయనం చేయాలని, ఎంతో తెలుసుకోవాలన్నారు. రెండేళ్ల సమయం పట్టవచ్చన్నారు. ఒకప్పటితో పోలీస్తే.. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు రాజీవ్ కనకాల.