National

ఇజ్రాయెల్ (Israel) సైన్యం, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ (Israel) సైన్యం, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా (Gaza) వైపు దూసుకెళుతోంది.

ఉగ్రవాదులను మొత్తంగా తుడిచిపెడతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అత్యవసర హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా పాలస్తీనాలోని భారతీయులు ఎవరైనా సరే తమకు అత్యవసర పరిస్థితి ఎవరైతే భారతదేశ ప్రతినిధి కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. వారికి సహాయం చేయడానికి ఈ అత్యవసర హెల్ప్ లైన్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని పాలస్తీలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఇజ్రాయెల్‌పై గత శనివారం హమాస్ ఒక్కసారిగా రాకెట్ దాడులతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నాయి. గాజాలు తలదాచుకున్న ఉగ్రవాదులే లక్ష్యంగా వేటాడుతున్నాయి. కాగా, ఇరు దేశాల దాడులతో ఇప్పటి వరకు 3600 మంది మరణించారు. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన 1200 మంది మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది.

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాజాలో వెయ్యికిపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు గాజాలో 1055 మంది మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాజాలోని చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్న క్రమంలో మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లోని ఇతర దేశాల పౌరులు అక్కడ్నుంచి స్వదేశాలకు పయనమవుతున్నారు.