AP

టీడీపీ సీనియర్ల సీట్ల మార్పు, ఎవరెక్కడ – చంద్రబాబు మార్క్ ఎంపిక..!!

ఏపీలో ఎన్నికల రాజకీయ వేడెక్కుతోంది. సీట్ల ఖరారు పైన టీడీపీ, వైసీపీలో సెగ మొదలైంది. వైసీపీలో భారీగా సిట్టింగ్ లను సీఎం జగన్ మారుస్తున్నారు. అటు టీడీపీ, జనసేన పొత్తుతో ఎవరికి సీట్లు వస్తాయనేది ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, కొందరికి సీట్లు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురి సీట్ల విషయంలోనూ నిర్ణయానికి వచ్చారు.

 

అభ్యర్దుల ఎంపిక: ఎన్నికల వేళ అటు సీఎం జగన్..ఇటు చంద్రబాబు అభ్యర్దుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన పొత్తుతో రెండు పార్టీల నుంచి ఆశావాహుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే సీట్లు..పోటీ పైన చంద్రబాబు – పవన్ మధ్య ప్రాధమికంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు 30 అసెంబ్లీ -2 లోక్ సభ సీట్లు ఇస్తారని చెబుతున్నారు.

 

బీజేపీతో పొత్తు విషయంలో స్పష్టత వచ్చిన తరువాత మేనిఫెస్టో – సీట్ల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక..ప్రస్తుతం టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేతో పాటుగా వైసీపీ నుంచి పార్టీలో చేరిన నలుగురికి సీట్ల విషయం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో నలుగురు వైసీపీలోకి మారిపోయారు. వీరు మినహా మిగిలిన పందొమ్మిది మందికీ టికెట్లు ఖాయమని చంద్రబాబు ప్రకటించారు.

 

మార్పులు – చేర్పులు: రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె బదులు భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేయనున్నారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీటు మారడం ఖాయంగా కనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో ఆయన ఉత్తర విశాఖ సిటీ స్థానం నుంచి గెలిచారు. ఈసారి ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. అయితే, జనసేన కూడా భీమిలి సీటు కోరుతోంది. దీంతో..గంటాకు భీమిలి దక్కుతుందా లేక మరేదైనా నియోజకవర్గం కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది.

 

సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రస్తుతం రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేన నేతలు కూడా ఆశిస్తున్నారు. టీడీపీ సిటింగ్‌ సీటు కావడం… బుచ్చయ్య సీనియర్‌ కావడం వల్ల ఆయనను అక్కడే కొనసాగిస్తారా లేక మరో సీటుకు మారుస్తారా అనేది తేలాల్సి ఉంది.

 

ఆ ఇద్దరికీ డౌట్: వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురిలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తిరిగి అక్కడే సీటు ఇవ్వనున్నారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలు సర్దుబాటుకు అంగీకరించడంతో శ్రీధర్‌రెడ్డికి మార్గం సుగమమైంది. అదే జిల్లాకు చెందిన వెంకటగిరి సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డికి టీడీపీ నాయకత్వం ఈసారి ఆత్మకూరు లేదా సర్వేపల్లి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

ఆయనకు సీటు ఖాయమేనని, పోటీ చేసే స్థానం ఏదో తేలాల్సి ఉందని అంటున్నారు. ఆనం సర్వేపల్లిలో పోటీ చేస్తే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోలేదని ఒక నేత పేర్కొన్నారు. మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి వారి సిటింగ్‌ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు అనుకూలించడం లేదు. వారికి మరేదైనా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఇద్దరికి ఈ సారి సీట్లు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది.