కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజల్లో లేదు. విభజనతో ఏనాడో ప్రజలకు దూరమైంది. అది నేతలపై ప్రభావం చూపింది. అందుకే వారంతా తమ భవిష్యత్తును వెతుక్కుని వెళ్ళిపోయారు. అయితే ఆ భవిష్యత్తు ఇచ్చే పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉందా? కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునే ఛాన్స్ ఉందా? లేదనే సమాధానం వినిపిస్తోంది. అటువంటప్పుడు ఎలా మనుగడ అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరో పొజిషన్లో ఉంది. మళ్లీ ప్రారంభం నుంచి ఆ పార్టీని పైకి తీసుకెళ్లాలి. జవసత్వాలు నింపాలి. పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే నాయకులు కావాలి. అన్నింటికీ మించి టీం వర్క్ ఉండాలి. వీటన్నింటినీ షర్మిల అధిగమించగలరా? అది సాధ్యమయ్యే పనియేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
2014 ఎన్నికలకు ముందు విభజన వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తుకున్నారు. వారి మాటను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెడచెవిన పెట్టింది. పోనీ విభజన హామీల్లోనైనా ఏపీకి న్యాయం చేసిందా? అంటే అదీ లేదు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. కేవలం మాటమాత్రంగా చెప్పి ఊరుకున్నారు. పోనీ విపక్షంలోకి వెళ్లాక పోరాడారా? అంటే అదీ లేదు. అలాగని మోడీని నిలదీసిన సందర్భాలు ఉన్నాయంటే? అవి కనిపించడం లేదు. ఇన్ని చేశాక జనం కాంగ్రెస్ పార్టీని ఎలా నమ్ముతారన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది.
కాంగ్రెస్ పార్టీకి ఉనికి పోలేదు. కానీ దానిని చాటేందుకు బలమైన నాయకత్వం అవసరం. ఆ నాయకత్వానికి కేంద్రం ప్రోత్సాహం అవసరం. కేవలం జగన్ ను నియంత్రించి షర్మిల కాంగ్రెస్ పార్టీ బలం పెంచుతారని భావించడం మాత్రం అతిశయక్తే. తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించి షర్మిల చేతులు కాల్చుకున్నారు. కుటుంబ రాజకీయాలతో ఆగ్రహంగా ఉన్నా ఆమె కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరారు. అంతమాత్రాన ఆమెను కాంగ్రెస్ ఆశాదీపంగా చూసుకోవడం మాత్రం అతి అనిపిస్తోంది. అసలు లక్ష్యాన్ని వదిలి.. కేవలం జగన్ టార్గెట్ చేసుకోవడం అనేది ఒక విఫలయత్నంగా మారే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఇది శ్రేయస్కరం కాదు. వాంఛనీయం అంతకంటే కాదు.