AP

ఎన్నికల వేళ అమరావతి కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రకటన..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచి జనాన్ని బాదుతున్నారన్నారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలు: ఆదివారం తిరువూరులో జరుగుతున్న రా.. కదిలి రా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టమోటాకు, పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు.

 

ఆరోజు సైబరాబాద్ తాను చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు. మనకు రాజధాని లేకుండా ఐదేళ్ల పాలించాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే దేవతల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. చివరకు చెత్తపై కూడా పన్ను వేసే స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబు మండిపడ్డారు.

 

అమరావతికి వైభవం: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని అన్నారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువల ధరలు పెరిగిపోయాయని చెప్పారు.

 

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే 32 మండాలలకు నీళ్లు వచ్చేవని, కానీ అది పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 25 సంవత్సరాల క్రితం తాను పిల్లలకు ఇచ్చిన ఆయుధం ఐటి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందన్నారు.

 

జగన్ పాలనపై ఆగ్రహం: మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసివేసారని ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. రైతే రాజుగా మారాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

 

భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. అయిదేళ్లల్లో 20 లక్షల మంది యవతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్ నమ్మటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు అందరూ సిద్దం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.