AP

రాజన్న బాణంలా దూసుకొస్తున్న షర్మిల..!

ఏపీ కాంగ్రెస్‌లో అనుకున్నదే జరిగింది. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినప్పుడే ఆమెకు లైన్ క్లియర్ అయింది. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేయకుండా షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక ఇప్పుడు రాష్ట రాజకీయాల్లో.. అది కూడా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా యాక్టివ్ అవ్వనున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కార్యాచరణ ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

 

వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పింది హైకమాండ్. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ గిడుగు రుద్రరాజు తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపే నాటికే షర్మిలకు బాధ్యతలు అప్పజెప్పాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకే ఏపీ పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీనామా చేయగానే.. వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు కట్టబెట్టేశారు ఏఐసీసీ పెద్దలు.

 

తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని పెట్టిన వైఎస్ షర్మిల. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతకుముందే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలను కలిసిన వైఎస్ షర్మిల పార్టీ విలీనం దిశగా చర్చలు జరిపారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో కలిపేశారు.

 

రాష్ట్ర విజభన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం రాజన్న బాణంలా వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో దించింది. వైఎస్‌పై ఉన్న సానుభూతి, అభిమానం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హైకమాండ్ నమ్మకంతో ఉంది. అందుకే ఆమెకు పీసీసీ చీఫ్‌ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.

 

షర్మిల ప్రస్తుతం కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ పనులు పూర్తవ్వగానే షర్మిల ఏపీలో పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయనున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యమని, అందుకోసం నిబద్ధతతో పని చేస్తానంటున్న ఆమె ఎఫెక్ట్‌తో.. ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే షర్మిలకు జై కొట్టేశారు. రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ బాట పట్టనున్నారంటున్నారు. ఇంకా వైసీపీలోని పలువురు అసంత‌ృప్తి నేతలు జగన్ సోదరి పక్షాన చేరడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి జగనన్న బాణం ఆయనకే రివర్స్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతుంటే.. కాంగ్రెస్ నేతలంతా హ్యాపీ అయిపోతున్నారిప్పుడు.